జ్యోతిషం నిజమా కాదా?

Astrology

హేతువాదులు జ్యోతిషం అంటేనే ఒంటి కాలి పై లేస్తారు. కాని మెజారిటి ప్రజలు కుల,మతాలతో సంభంధం లేకుండా జ్యోతిషాన్ని నమ్ముతున్నారు .ఈ నమ్మకంలో ఏ మెరకు హేతుబద్దత ఉంది అన్నది ప్రశ్నార్థకమే. కాని నమ్ముతున్నారు. సామాన్య ప్రజలే కాదు -ఏలికలు పాలకులు సైతం నమ్మేస్తున్నారు. జ్యోతిషం -జ్యోతిషం పై నమ్మకంతో వచ్చే చిక్కులు ఒక ఎత్తైతే పరిహారాల పేరిట వచ్చే చిక్కులు మరో ఎత్తు. కేవలం జ్యోతిషం పై నమ్మకంతో నాశనమై పోయిన వ్యక్తులు ఎందరో? -కుటుంభాలు  ఎన్నెన్నో? పరిహారాల కథ వేరే చెప్పక్కర్లేదు.
ఇంతకీ జ్యోతిషాన్ని నమ్మొచ్చా? నమ్మ కూడదా?
ఏదైన కూడలిలో ట్రాఫిక్ ఎస్.ఐ నిలబడి “బండ్లు “చెక్ చేస్తున్నాడని ఆ రోడ్డులో ప్రవేశించడానికి ముందు ఎవరైనా చెబితే మనం ఏం చేస్తాం? మన దగ్గర అన్ని “కాయితాలు” ఉన్నాయా? ఆలోచించుకుంటాం.  అన్నీ ఉంటే అదే దారిన ముందుకెళ్తాం. ఏవో ఒకటి రెండు కాయితాలు లేవు. అప్పుడేంచేస్తాం? ఎందుకొచ్చిన తంటా అని సన్న సందులో దూరి  గమ్యం చేరుకోవడమో ? వెనక్కి  వచ్చెయ్యడమో చేస్తాం.
జ్యోతిషం విషయంలోను ఇంతే పరిస్థితి. శాస్త్రి గారు ..”అబ్బె! మీ రాశికి టయాలు బాగా లేదండి” అంటారనుకొండి. మనం ఏం చెయ్యాలి? సహజ సిద్దంగానే మనం ఒక పద్దతిగా “వెళ్ళే” వ్యక్తి అయితే పెద్దగా చింతించాల్సిన పని లేదు . మించి పోతే ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే సరి పోతుంది .
అసలది మన కేరక్టరే కాదు .గాలి వాటంగా ముందుకు వెళ్ళే వ్యక్తి అనుకొండి .అప్పుడు “బ్యేక్ టు ది పెవిలియనో” లేదా నాటి గవాస్కర్లా డిఫెన్సు ఆడుకోవడమో మొదలు పెట్టాలి .
జ్యోతిషంలో రెండు రకాలున్నాయి. ఒకటి కేవలం మీ జన్మ నక్షత్రం,రాశిని పట్టి చెప్పేది.దీన్ని గోచారం అంటారు .ఉన్నవి 12 రాశులు -27 నక్షత్రాలే. మరి జీవితాలు కూడ 12/27 రకాలుగానే ఉండాలిగా? అలా ఉన్నాయా? లేదు. కాబట్టి ఈ విదమైన జ్యోతిషాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చి తల చెడుపుకోవలసిన పని లేదు .
జ్యోతిషంలో మరో రకం ఉంది. మీ పుట్టిన తేది,సమయాన్ని పట్టి – ఆ సమయంలోని గ్రహస్థితిని పట్టి చెప్పేవి. ఇందులోను దాదాపుగా రెండేసి గంటలకు ఒకే లగ్నం – ఒకే గ్రహస్థితి ఉంటుంది. మన దేశంలో నిమిషానికి నలుగురు పిల్లలు పుడతారట. ఒక లగ్నం రెండు గంటలుంటుంది . అంటే 120 నిమిషాలు. నిమిషానికి నలుగురు పిల్లలంటే 120‍X4 = 480 మంది పిల్లలు ఒకే లగ్నం ఒకే జాతకంలో పుడ్తారు . అంటే వీరందరి జీవితాలు ఒకేలా ఉంటాయా? ఉండవు కాక ఉండవు .
మన మెగా స్టార్ చిరంజీవి పుట్టిన అదే లగ్నం-జాతకంలో మరో 479 మంది పిల్లలు పుట్టి ఉంటారుగా? వారిలో ఏ ఒకరూ మెగా స్టార్ కాలేదెందుకు? మరో ఎపిసోడ్లో ఈ పంచాయితీ తెంచుతా. ప్లీజ్ వెయిట్.