జిల్లాలో తాగునీటి ఇక్కట్లు

జిల్లాలో తాగునీటి ఇక్కట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గుక్కెడు నీరు అందక జనం అల్లాడిపోతున్నారు.  ప్రైవేటుగా నీరు కొనుగోలు చేసి గొంతులు తడుపుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం నెలకు ఒక్కొక్క కుటుంబం వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా భావిస్తున్న వ్యాపారులు రేట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.వర్షాభావం నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలా లు పూర్తిగా అడుగంటాయి. చెరువులు, బోరుబావులు ఎండిపోయాయి.

water queue

తంబళ్లపల్లె, కుప్పం, పుం గనూరు, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలో సమస్య తీవ్రస్థాయికి చేరింది.ప్రజలు ప్రైవేటు బోర్లు, ట్యాంకర్ల వద్ద నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. బిందె నీరు రూ.3 నుంచి రూ.5 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులున్న సాధారణ కుటుంబానికి నెలకు మూ డు ట్యాంకర్లకు తక్కువ లేకుండా నీరు అవసరమవుతోంది. ఇక తాగునీరు కొనుగోలు సరేసరి. మొత్తంగా ఒక కుటుంబం సగటున నెలకు రూ.1,800 తక్కువ లేకుండా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది పేద, మధ్య తరగతి కుటుంబీకులకు భారంగా మారింది.
నీటి కొరతను అవకాశంగా తీసుకున్న వాటర్ ప్లాంట్ల యజమానులు అధిక ధరలతో ప్రజలను దోచుకుంటున్నారు. ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. నెల క్రితం వరకు ట్యాంకర్ ఉప్పు నీరు రూ.150 నుంచి 200 లోపు ఉండగా, మంచినీరు రూ.250 నుంచి 300 వరకు ఉండేది. ఈ నెలలో ట్యాంకర్ ఉప్పు నీరు రూ.300 నుంచి 400 మధ్య అమ్ముతుండగా, మంచినీరు రూ.500 వరకు పలుకుతోంది. ట్యాంకర్ యజమానులు బోరు యజమానుల వద్ద ట్యాంకర్ నీటిని రూ.80 నుంచి 100 వరకు కొనుగోలు చేస్తున్నారు.

అది కూడా పనికిరాని నాసిరకం నీటినే ప్రజలకు అంటగడుతున్నారు. 5వేల లీటర్లు నీళ్లిస్తామంటూ 4వేల లీటర్ల లోపు నీటినే పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం జిల్లాలో 52 వాటర్ ప్లాంట్లు ఉండగా వీటిలో 8 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్‌ఐ మార్కు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారకంగా 150 నుంచి 200 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు సమాచారం. గతంలో వాటర్‌క్యాన్ రూ.25 అమ్ముతుండగా, ప్రస్తుతం రూ.30 నుంచి 35కు పెంచారు.

ప్రభుత్వ నీటి సరఫరా మొక్కుబడిగా చేస్తుంది.

జిల్లావ్యాప్తంగా వేలాది గ్రామాల్లో తాగునీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వం మొక్కుబడిగా సరఫరా చేస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2,200 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తుండగా, మరో 300 గ్రామాల్లో టైఅప్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.6 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ప్రజలకు తగినంతగా నీరు సరఫరా చేయకపోవడంతో వారు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.

పశువులకూ నీరు కొనాల్సిందే

ప్రజలు తాగేందుకేగాక పశువులకు సైతం నీటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. పశువులకు నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నా అది తూతూమంత్రంగానే సాగుతోంది. జిల్లాలో 9.64 లక్షల పశువులున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పడమటి మండలాల పరిధిలోనే 5 లక్షల పైచిలుకు పశువులున్నట్లు అంచనా. వీటిన్నింటికీ వేసవిలో నీటిని అందించాల్సి ఉంది. పెద్ద సైజు ఆవులు ఒక దఫాకు 30 నుంచి 40 లీటర్ల వరకు నీరు తాగుతుంది. ఈ లెక్కన ఉన్న పశువులకు వేసవి మొత్తం నీటిని అందించాలంటే ప్రజలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.