రెండురోజుల్లో ‘ఈ-పాస్‌’ సమస్య పరిష్కారం జేసీ నారాయణ భరత్‌ గుప్తా

రెండురోజుల్లో ‘ఈ-పాస్‌’ సమస్య పరిష్కారం
* జేసీ నారాయణ భరత్‌ గుప్తా
చిత్తూరు ఈ-పాస్‌ విధానంలోని సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే నిత్యావసరాల పంపిణీలో అలస్యం జరుగుతున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. శనివారం మిట్టూరులోని 52వ చౌకదుకాణంలోని ఈ-పాస్‌ విధానాన్ని జేసీ పరిశీలించి వినియోగదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల్లో 421 చౌకదుకాణాలకు తొలివిడతగా ఈ-పాస్‌ విధానాన్ని అనుసంధానం చేశామన్నారు. ఈ విధానం అమలువుతున్న అన్నీ దుకాణాల్లో డీలర్లు నిబంధనల ప్రకారమే సరకుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. నూతన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యం తీసుకురావాలని కోరారు. నిత్యావసర సరకుల సరఫరాలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్టు వేయడానికే సర్కారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. నూతన విధానంలో ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాలకు ఒకే సర్వరు ఉండేదని, దీని కారణంగానే కార్డుదారుల బయోమెట్రిక్‌ నమోదు, పంపిణీల్లో తీవ్ర ఆలస్యం జరిగేదన్నారు. ప్రస్తుతం ఆరు జిల్లాలకు ఒక సర్వరును ఏర్పాటుచేశారని, లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి విజయరాణి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.