కరవులో రాష్ట్రం మొత్తంలో చిత్తూరు జిల్లా పరిస్థితి దారుణంగా ఉందని అటవీశాఖామంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన చిత్తూరులో మామిడి రైతుల అవగాహనా సదస్సుకు వెళ్తూ మార్గమధ్యలో పూతలపట్టు వద్ద మాజీ మంత్రి గల్లాఅరుణకుమారికి సంబంధించిన మామిడి తోటలో ఎండిపోయిన చెట్లతోపాటు ఇతర రైతుల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. రైతులు సంవత్సరం పాటు మామిడి మొక్కలను కాపాడుకోవాల్సి ఉందని.. ఈలోపు హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీరు తెప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమించడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, దీనికోసం నెలకు రూ.7కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. తాగునీటి సమస్యతో వన్యప్రాణులు గ్రామాలపై పడి పంటలను ధ్వంసం చేస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా తెదేపా జిల్లా కార్యదర్శి మురళీమోహన్‌నాయుడు ఆయన్ను కలుసుకుని హంద్రీనీవా నీరు పూతలపట్టు మండలానికి కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాటూరు మీదుగా ఎన్‌ఆర్‌ జలాశయానికి నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటే పూతలపట్టు మండలానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రికి వివరించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని వైకాపా జిల్లా అధికారప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి మంత్రిని కలసి విన్నవించారు.

News Reporter