*తెలుదేశంపార్టి లో పుట్టు కొస్తున్న అసంతృప్తులు*

aruna

dora babu

*తెలుదేశంపార్టి లో పుట్టు కొస్తున్న అసంతృప్తులు*
తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు పుట్టుకొస్తున్నాయి. ఏ జిల్లాకా జిల్లాలో పదవి దక్కని వారు పెదవి విరుస్తున్నారు. కొందరు లోలోపల చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. ముప్పై సార్లు పార్టీలు మారిన వారికి, నోరేసుకుని మీడియా వద్ద వాగేవారికి, ఎప్పుడో తెరమరుగైన వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. ఇక మూల స్తంబాల్లాంటి వారిని, జన బలం ఉన్నవారిని పక్కన పెట్టేశారనే వాదన వినిపిస్తోంది. వీరిలో కొందరు నోరు మెదపకుండా ఉంటే, గల్లా అరుణమ్మలాంటి వారు బహిరంగంగానే అడిగేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాస్త వేడిగానే కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో టీడీపీ నాయకులు దొరబాబు, గల్లా అరుణకుమారికి చోటు దక్కలేదు.చివరివరకు వారు ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తేవారికే ఎమ్మెల్సీ పదవులు దక్కాయని పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నడిచిన వారికి సైతం బాబు మొండి చేయి చూపారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గతంలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి, ఒక్క ఓటుతో ఓడిపోయిన దొరబాబుకు ఈసారి అవకాశం దక్కుతుందని అందరూ ఊహించారు.

అయితే అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని గౌనివారి శ్రీనివాసులుకు కట్టబెట్టారు. దొరబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జెడ్పీచైర్ పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ అనురాధ తదితరులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చూద్దాంలే అంటూనే సీఎం దాటవేయడంతో నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పదవుల వ్యవహారంలో మంత్రి మాటను సైతం పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం.

పదవులు ఆశించి భంగపడిన గల్లా అరుణతో పాటు, మరికొందరు బాబు వ్యవహార శైలిపై లోలోన రగిలిపోతున్నారు. ఇటీవల చిత్తూరులో జరిగిన మిని మహానాడులో షో చేసి, హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేస్తేనే పదవులంటూ గల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పని చేసేవారికి పదవులు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.