పూతలపట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

పూతలపట్ట సమీపం పి.కొత్తకోట వద్ద ఆదివారం తెల్లవారు జామున కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు కేరళవాసులు దుర్మరణం చెందారు.ఇక గంటలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేసమయంలో ఆ  కుటుంబం మృత్యువాత పడింది. నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆదివారం వేకువజామున 4 గంటలకు పూతలపట్టు వద్ద లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కేరళవాసులు దుర్మరణం చెందారు. పదేళ్ల బాలుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు.

Truck-in-Small-Car

 పోలీ సుల కథనం మేరకు… కేరళ రాష్ట్రం కన్‌హర్‌వాడ్ జిల్లా చమ్మత్తమరాయల్ మండలం బెల్లా గ్రామానికి చెందిన సంతోష్(49), భార్య ఆశ(45), పెద్దకొడుకు హరికృష్ణ(16), చిన్నకొడుకు అశ్విన్‌తో కలసి  కెఎల్ .28ఎ. 5609 నెంబర్ సన్నీ కారులో శనివారం తిరుమలకు బ యలుదేరారు. కారును సంతోష్ డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటికే వారి బంధువులు తిరుమలకు చేరుకుని వీరి కోసం ఎదురు చూస్తున్నారు. ఆదివారం ఉదయం వేకువజామున పూతలపట్టు సమీపంలో పి.కొత్తకోట వద్ద   తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఏపీ.02.టిబి.9239 నెంబర్ లారీని కారు ఢీకొంది.కారు పూర్తిగా లారీ ఇంజన్ కిందకు వెళ్లిపోయింది. పది అడుగుల మేర కు కారును లారీ లాక్కెళ్లింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. సంతోష్, ఆశ, హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు అతికష్టంపై జేసీ బీ  సాయంతో బయటకు తీశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు.ముందు సీట్లో తల్లి  ఒడిలో కూర్చొన్న  అశ్విన్ తీవ్రగాయాలతో బతికిబయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే డోర్ అద్దాలు ధ్వంసం కావడంతో అశ్విన్ తల బయటపడింది.  దీంతో అశ్విన్‌కు తల, మోకాలుపై తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే బాలుడిని పోలీసులు, స్థానికులు  108 వాహనంలో  చి త్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోష్, ఆశ  కేరళ రాష్ట్రం కానంగాడ్ జిల్లా కాపూర్ ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌లుగా పనిచేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే తిరుమల నుంచి బంధువులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారి రోదనలు అక్కడి వారిని కంటతడిపెట్టించాయి.శనివారం నుంచి సంతోష్ డ్రైవింగ్ చేస్తుండటం, తెల్లవారుజామున నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.