ఎర్రచందనం కోసం ఎస్‌ఐగా మారాడు!

చిత్తూరు అర్బన్: ఎర్రచందనం దుంగల్ని తరలించడానికి ఓ వ్యక్తి ఎస్‌ఐగా అవతారమెత్తాడు. వెంట ఐదుగురు వ్యక్తులను పెట్టుకొని, ఎర్రచందనం దుంగల్లి సుమోలో నింపుకొని తమిళనాడు-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు దాటాలని చూశాడు. చివరకు పోలీసుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు. చిత్తూరు సీఐ ఎం.ఆదినారాయణ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు గుడిపాల-తమిళనాడు సరిహద్దులో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ సుమోలో ఎస్‌ఐ దుస్తులు ధరించిన వ్యక్తి వచ్చాడు. అతని వెంట ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. అనుమానం రావడంతో పోలీసులు వారి వాహనాన్ని ఆపారు. దాంతో నలుగురు వ్యక్తులు వెంటనే వాహనం దిగి పారిపోయారు. అనుమానం వచ్చి తనిఖీ చేస్తే సుమోలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయి.

ఈ ఘటనకు సంబంధించి గుడిపాల మండలం పల్లూరుకు చెందిన బాలు, తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన తమిళ సెల్వంను అరెస్టు చేశారు. వాహనం, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాహనంలో ఎర్రచందనం దుంగలు ఉంచుకుని ఎస్‌ఐ దుస్తుల్లో వెళితే తనిఖీ చేయరనే ఉద్దేశంతో బాలు అనే వ్యక్తి ఈ అవతారం ఎత్తినట్లు అంగీకరించాడు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Source:- Sakshi.com