మా ఎలక్షన్స్‌లో రాజేంద్ర ప్రసాద్ విజయం

images1

  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల్లో సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఘనవిజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్ని తలపించేలా ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం విదితమే. సాధారణ రాజకీయాలను తలదన్నేల్లా సినీ రాజకీయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన మా ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌ ప్యానెల్‌ గెలుపొందింది. నటి జయసుధపై 85 ఓట్ల తేడాతో రాజేంద్రప్రసాద్‌ విజయంపొందారు. దీంతో ఫిల్మ్‌ఛాంబర్‌ వద్ద రాజేంద్రప్రసాద్‌ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ తరపున పోటీచేసిన శివాజీరాజా, కాదంబరి కిరణ్‌, ఏడాది శ్రీరాం గెలుపొందారు. మా కార్యదర్శిగా శివాజీరాజా గెలుపొందారు. 36 ఓట్ల ఆధిక్యంతో అలీపై శివాజీరాజా గెలిచారు.ఈసీ మెంబర్లుగా కాదంబరి కిరణ్‌, ఏడిది శ్రీరాం విజయం సాధించగా, కోశాధికారిగా పరుచూరి వెంకట్శేరరావు విజయం సాధించారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలతో అటు జయసుధ టీమ్‌, ఇటు రాజేంద్రప్రసాద్‌ టీమ్‌ మీడియాకెక్కి ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. తొలుత రాజేంద్రప్రసాద్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్తున్నట్లు ప్రకటించగా, దాన్ని జీర్ణించుకోలేక మురళీమోహన్‌, జయసుధను రంగంలోకి దిగారు. అంతకు ముందు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని మురళీమోహన్‌ ప్రకటించారు. ఇక్కడే సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది.

ఈ ఎన్నికల ఫలితాలు మురళీమోహన్‌కి గుణపాఠం కిందే భావించాల్సి వుంటుందని పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. జయసుధ ఓటమి గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడటంలేదంటే, మురళీమోహన్‌ పట్ల సినీ రంగంలో. మరీ ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుల్లో ఏ స్థాయి వ్యతిరేకత వుందో అర్థం చేసుకోవచ్చు. పరాజయాన్ని ముందే ఊహించిన జయసుధ, అసలు కౌంటింగ్‌ కేంద్రానికే రాలేదు. తన గెలుపు పట్ల పూర్తి నమ్మకంతో వున్న రాజేంద్రప్రసాద్‌, ఉదయాన్నే కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చారు. తన గెలుపు ఖాయమైన అనంతరం మీడియా ముందుకొచ్చి విజయదరహాసాన్ని ప్రదర్శించారు.