పుత్తూరు ఎంపీడీవో, సీఐలపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోజా

ప్రజా సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లనీయకుండా అడ్డుపడుతున్న పుత్తూరు సీఐపై ఐజీ, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఆయన తెలుగు దేశం కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేగా పిలిచినా సీఐ వచ్చి మాట్లాడే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు రాలేదనే సమస్యను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్ని సార్లు ఫోన్‌ ద్వారా సంప్రదించినా, కార్యాలయానికి వెళ్లినా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. శుక్రవారం జరిగే మండల సమావేశంలోనైనా పింఛన్లు అందని వారితోపాటు, రుణాల విషయమై ఆమెతో మాట్లాడేందుకు వచ్చినా స్థానిక ఎమ్మెల్యేకు విలువ ఇవ్వడంలేదని ఆరోపించారు. సంబంధంలేని విషయంలో తెదేపా కార్యకర్తలను రెచ్చగొట్టి తమపై గొడవకు ఉసుగొల్పుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టరు వెంటనే స్పందించి ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని కోరారు.