అధికారులు స్పందించకపోవడం బాధాకరం

* వకుళామాత ఆలయాన్ని సందర్శించిన ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం
పాతకాల్వ తిరుపతి గ్రామీణ మండలం పాతకాల్వ సమీపంలోని పేరూరు కొండపై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం శనివారం సందర్శించింది. ఆలయ పరిసరాలను భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ఆ బృందానికి చూపించారు. అద్భుత కళాఖండమైన వకుళామాత ఆలయం శిథిలావస్థను చూసి ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం విచారం వ్యక్తం చేసింది. ఆలయం, పరిసరాలను ఫొటోలు తీసుకున్నారు. ఆలయంలోపల రాళ్లపై ఉన్న లిపిని పరిశీలించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి తల్లి అయిన వకుళామాత ఆలయం ఇంత దుస్థితికి చేరుకున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. పేరూరు కొండపై అక్రమ క్వారీని నిలుపుదల చేయడానికి రెవెన్యూ, తితిదే అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఆలయాన్ని పునర్‌నిర్మించడానికి అధికారులపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వకుళామాత ఆలయం పునర్నిర్మాణం విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతామని వివరించారు. ఇకనైనా అధికారులు వకుళామాత ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంచాలకులు నంబిరాజా, ఉప సంచాలకులు మునిరత్నం, సీనియర్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీనివాసులు, కృష్ణచైతన్య, ఫోటోగ్రాఫర్‌ వసంత్‌కుమార్‌, రాజేష్‌ తదితరులున్నారు.