సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొస్తే ప్రోత్సాహకాలు

తిరుపతి రాష్ట్రంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామని ప్రభుత్వ ప్రతినిధి కమలాకర్‌ తెలిపారు. శనివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సోలార్‌ డెవలప్‌మెంట్‌ సమిట్‌-2015 జరిగింది. ఈ కార్యక్రమాన్ని నెడ్‌క్యాప్‌ సంస్థ నిర్వహించింది. ఇందులో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర్రలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సోలార్‌ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వచ్చేవారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వెంటనే అవసరమైన అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సోలార్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2వేల మెగా వాట్లు ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చేవారికి కల్పించే సౌకర్యాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఇందులో పాల్గొన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నెడ్‌క్యాప్‌ అధికారులు పాల్గొన్నారు.