అర్ధరాత్రి 13 మృతదేహాల అప్పగింత ఎన్‌కౌంటర్‌పై బాధితుల ఆవేదన

అర్ధరాత్రి 13 మృతదేహాల అప్పగింత
ఎన్‌కౌంటర్‌పై బాధితుల ఆవేదన
చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు సమీపంలోని శేషాచలం అడువుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో 20 మంది ఎర్రచందనం కూలీల మృతదేహాలను తమిళనాడులోని వారి స్వగ్రామాలకు తరలించడం గురువారం తెల్లవారుజాముకల్లా పూర్తయింది. ఏడు మృతదేహాలను మొదట విడతలో, మిగిలిన 13 అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు బంధవులకు అప్పగించారు. ఎస్వీ వైద్య కళాశాల మార్చురీ వద్ద జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్‌, ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, తిరువణ్ణామలై జిల్లా పాలనాధికారి వీరరాఘవరావు, వేలూరు నార్త్‌ జోన్‌ ఐజీ మంజునాథ, వేలూరు డీఆర్వో మణివన్నన్‌, తిరువణ్ణామలై డీఆర్వో పళని సమక్షంలో మొదట విడతగా బుధవారం సాయంత్రం 7గంటలకు ఏడు మృతదేహాలను తరలించారు. అనంతరం మిగిలిన 13 మృతదేహాలకు సంబంధించి చిరునామాలు గుర్తించడంతో సంబంధిత బంధువులు అర్ధరాత్రి ఎస్వీ వైద్యకళాశాల మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డులను పరిశీలించి 13 మృతదేహాలను తరలించారు. ఈ ప్రక్రియ గురువారం తెల్లవారుజామున 4గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మృతుల బంధువులు తమ వారిని పోలీసులు అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని శాపనార్థాలు పెట్టారు. అనంతరం మృతదేహాలను తమిళనాడుకు చెందిన అంబులెన్స్‌లలో 13 మందికి సంబంధించిన స్వగ్రామాలకు తరలించారు.