క్రూరమైన హత్య

చిత్తూరు : చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఎండీఎంకే అధినేత వైగో సహా 400 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి జైలుకు తరలించే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ”ఇది క్రూరమైన హత్య. ఎన్ కౌంటర్ కానేకాదు. అత్యంత క్రూరంగా జరిగింది. చెట్లు కొట్టుకుంటున్న కూలీలను హతమార్చారు. వాళ్లను చిత్రహింసలు పెట్టారు.
ఆ తర్వాత అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. వాళ్ల శరీరంపై ఉన్న గాయాలే అందుకు నిదర్శనం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ విషయంలో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడులో అన్ని ప్రాంతాల్లోను నిరసనలు జరుగుతున్నాయి.

71428650024_625x300

ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు చెల్లించాలని వైగో డిమాండ్ చేశారు.  ఏపీ ప్రభుత్వం కావాలనే బయట ఉన్న కూలీలను తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఉన్న కూలీల బాధ్యతను తమిళనాడు ప్రభుత్వానిదే అని వైగో అన్నారు.   కాగా తమిళనాడు-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీగా వస్తున్న వైగో సహా పలువురు కార్యకర్తలను వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.