మెరుగైన వైద్య సేవలందించాలి

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందని ఎంపీపీ కుసుమకుమారి అన్నారు. ఆమె శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆసుపత్రి సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా అందడం లేదని పేదలు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. నిరుపేదలు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారిణి లక్ష్మీనరసమ్మ మాట్లాడుతూ గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకొని చికిత్సలు పొందాలని, ఇక్కడే ప్రసవం పొందితే మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని అన్నారు. వెలుగు ఏపీయం ప్రభాకర్‌రెడ్డి, అంగన్‌వాడీ పర్యవేక్షకురాలు రమాదేవి, వైద్య సిబ్బంది సుగుణవతి, బహుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.