1. చిత్తూరు:

చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు గూడూరు – కాట్పాడి రైలు మార్గంలో ఉన్నది. చిట్టి, ఊరు అను రెండు పదాల నుండి లేదా చిత్‌, ఊరు అను పదాల నుండి చిత్తూరు అను పేరు వచ్చింది. చిట్టి అనగా చిన్న అని, చిత్‌ అనగా విజ్ఞానం అని అర్థం. క్రీ.శ.3వ శతాబ్దంలో చిత్తూరు పల్లవ రాజ్యంలో అంతర్భాగమయినది. ఆ తరువాత చోళులు చిత్తూరును చాలా కాలం పాలించారు. క్రీ.శ.13వ శతాబ్దంలో చిత్తూరు యాదవుల పాలనలోకి వచ్చింది. క్రీ.శ.1324 ప్రాంతంలో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ (ఢిల్లీ సుల్తాన్‌) చిత్తూరు ప్రాంతాన్ని ఆక్రమించాడు. అయితే వారి పాలన ఎక్కువ కాలం సాగలేదు. హరిహర, బుక్కసోదరులు విజయనగర రాజ్యాన్ని స్థాపించడంతో క్రీ.శ.1336 చిత్తూరు వారి పాలనలోకి వచ్చింది. క్రీ.శ.1646 నుండి చిత్తూరు ప్రాంతం గోల్కొండ నవాబుల ఆధీనంలోకి వచ్చింది. గోల్కొండ నవాబుల సామంతులుగా కడప నవాబు మదనపల్లి, వాయల్పాడు, పుంగనూరు ప్రాంతాలు, తక్కిన జిల్లాలోని ప్రాంతాలను ఆర్కాట్‌ నవాబు పాలించారు. గోల్కొండ రాజ్యపతనానంతం కర్ణాటక నవాబులు చిత్తూరు ప్రాంతంపై అధికారం చెలాయించారు. ఆ తరువాత మహారాష్ట్రులు, మైసూరు పాలకులు హైదరాలి, టిప్పుసుల్తాన్‌ కొంతకాలం చిత్తూరు ప్రాంతాన్ని ఆక్రమించారు. మైసూరు యుద్ధాలలో ఆంగ్లేయుల చేతిలో పరాజయం చెందిన మైసూరు పాలకుడు హైదర్‌ అలీ శ్రీరంగపట్నం సంధికి అంగీకరించాడు. దీని ప్రకారం ఆంగ్లేయులు మదనపల్లి, వాయల్పాడు, చంద్రగిరి ప్రాంతాలను నిజాంకు, మిగతా జిల్లాను ఆర్కాటు నవాబుకు ఇచ్చారు. ఆంగ్ల సైన్య పోషణ కొరకు 1801లో నిజాం రాయలసీమ ప్రాంతాన్ని ఆంగ్లేయుల కిచ్చినాడు. ప్రస్తుతం ఉన్న చిత్తూరు జిల్లా 1911లో ఏర్పాటయింది.
రామ, ఈశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ ఆలయాలు, 9 మసీదులు, 4 చర్చలు చిత్తూరులో గలవు. ఇంకా అంకాలమ్మ, పొన్నమ్మ, వినాయక ఆలయాలు చిన్నవి ఇచట గలవు.
సముద్రా మట్టానికి 1000 అడుగుల ఎత్తున గల చిత్తూరును ఆంగ్లేయులు కలెక్టర్‌ నివాసంగా చేసుకోడనికి గల ప్రధాన కారణాలు పాలార్‌కు ఉత్తరంగా గల తాలూకాలకు మధ్య స్థానంలో ఉండడం, చిత్తూరు పరిసరాలలో గల అవిధేయులైన పాలేగార్లను అదుపులో ఉంచడం. నదికి దక్షిణాన, ఎత్తైన కొండకు ఉత్తరాన చిత్తూరు నెలకొని ఉంది. చిత్తూరుకు పడమర చిన్న చతురస్రాకారపు కోట గలదాు. ఇది చిత్తూరు జాగీర్ధారు నివాస స్థానం. ఇతని కింద సుమారు 20 మంది పాలేగార్ల ఉండేవారు. చిత్తూరు పట్టణానికి ఉత్తరాన సంతపేట, దక్షిణాన కలెక్టర్‌ కచ్చేరి చుట్టూ గ్రీమ్స్‌పేట (దీనిని కలెక్టర్‌ గ్రీమ్స్‌ కాలంలో నిర్మించబడింది), తూర్పున కట్టమంచి గలవు, ఆగ్నేయాన ఐరోపావారి నివాసాలు (ప్రస్తుత నాయుడు బిల్డింగ్స్) ఉండేవి.

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21