ఆర్‌ఎం తీరును నిరసిస్తూ.. ఎన్‌ఎంయూ కార్మికుల మెరుపు సమ్మె రీజియన్‌ పరిధిలో ఆగిన బస్సులు

ఆర్‌ఎం తీరును నిరసిస్తూ.. ఎన్‌ఎంయూ కార్మికుల మెరుపు సమ్మె
రీజియన్‌ పరిధిలో ఆగిన బస్సులు
అధికారుల స్పందనతో పునరుద్ధరణ
తిరుపతి ఆర్టీసీ తిరుపతి ప్రాంతీయ కార్యాలయం మేనేజరు జి.మహేశ్వర కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ప్రాంతీయ నాయకుల పిలుపు మేరకు శుక్రవారం తెల్లవారుజామున కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. రీజియన్‌ మొత్తంగా ఉన్న 1500 బస్సులు స్తంభింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి కనుమ రోడ్డులోనూ బస్సులు నిలిపివేయాలని తమ యూనియన్‌ డిపో నాయకులకు సూచించారు. అలిపిరి డిపో ఎదుట ఎన్‌ఎంయూ డిపో కార్యదర్శి మస్తాన్‌ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకే కార్మికులు గుమికూడి ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ణయాలు అందరికి సమానంగా ఉండాలని డిమాండ్‌ చేశారు. డిపో పరిధిలో నిబద్ధతతో పనిచేస్తూ, ఉన్నతాధికారుల సూచనలు, సలహాల మేరకు విధులు నిర్వహిస్తున్నా, ఐదు వేలకు పైగా క్యాట్‌ కార్డులు విక్రయించినా, డబుల్‌ డ్యూటీలు చేసినా సహాయ మేనేజరు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదన్నారు.