ఎర్రకూలీల ఎన్‌కౌంటర్‌ను రాజకీయం చేయొద్దు

ఎర్రకూలీల ఎన్‌కౌంటర్‌ను రాజకీయం చేయొద్దు

ఎర్ర చందనం దొంగల ఎన్‌కౌంటర్‌పై రాజకీయ విమర్శలు మానుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ కోరింది.

గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా జిల్లా కన్వీనర్‌ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శేషాచలం కొండల్లో ఎర్రచందనం విత్తనాలు హెలికాప్టర్‌ ద్వారా చల్లించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విలువైన ఎర్రచందనం చెట్లు ఏడుకొండలపై ఉన్నాయని, వాటిని రక్షించేందుకు తెదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టకపోగా, స్మగ్లర్లను పెంచి పోషించిందని ఆరోపించారు. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా ఖాతరు చేయక దోచుకోవడమే లక్ష్యంగా అడవుల్లోకి వెళ్లిన వారు పోలీసులపైనే దాడులకు దిగుతుండడంతో ఆత్మరక్షణకోసమే కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ సంఘటనను వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు

ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర బీసీసెల్‌ ఉపాధ్యక్షుడు షణ్ముగం, జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్‌లు మాట్లాడుతూ విలువైన చెట్లను నరికే కూలీలు కూడా స్మగ్లర్లేనని, వారి కారణంగానే ఎర్రచందనం అడవులు దాటుతున్నట్లు తెలిపారు.

ఎర్రచందనం రవాణాను అడ్డుకోవడం వైకాపాకు ఇష్టం లేదన్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులపై దాడులు చేసి అంతమొందించినప్పుడు వీరంతా ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలకోసం చేపట్టే అధికారిక చర్యలపై ఇకనైనా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి వై.వి.రాజేశ్వరి, నాయకులు వెంకటరమణరాజు, సీఎంటీ త్యాగరాజన్‌, మోహన్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.