బీసీ ఉపప్రణాళిక అమలుచేయాలి

బీసీ ఉపప్రణాళిక అమలుచేయాలి
సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌
బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్‌ అమలు చేయాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మురగయ్య, గౌరవాధ్యక్షుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ బీసీ బ్యాంకును ఏర్పాటు చేసి, బీసీ కార్పొరేషన ద్వారా అందించే రాయితీ పథకాలను సులభతరం చేయాలని కోరారు. బీసీలకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్‌ పాలసీని అమలుచేయాలని తెలిపారు. తీర ప్రాంత మత్స్యకారులకు శీతల గిడ్డంగులను నిర్మించాలని, మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు 50 శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అత్యంత వెనుకబడిన బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసి 25 శాతం అణగారిన వర్గాలకు చెందిన పిల్లలకు కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలన్నారు. నాచియప్పన్‌ కమిటీ సిఫార్సుల మేరకు బీసీ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. బీసీ ఉపప్రణాళికను వెంటనే అమలు చేయాలని తెలిపారు. బీసీ కమిషన్‌ మొక్కుబడిగా రాజధానిలో పర్యటించి నివేదికలు ఇవ్వడం సరికాదన్నారు. బీసీలు అణగారిన వర్గాలకు చెందిన వారే కావడంతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం పరిధి నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీల అభివృద్ధి కోసం సీమాంధ్ర బీసీ సంఘం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు సీ.వీరాంజనేయులు, పిచ్చయ్య యాదవ్‌, రాధమ్మ, శ్రీదేవి, హనుమంతరావు, సాయివరప్రసాద్‌, విద్యార్థి నాయకులు మురళీకృష్ణయాదవ్‌, రాంబాబు, కేశవనారాయణ, జిల్లాలోని బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.