కుటుంబ కలహాలతో..భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో..భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
* ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి
చిత్తూరు : కుటుంబ కలహాలతో శుక్రవారం అర్ధరాత్రి భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త మృతిచెందగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిత్తూరు నగరం ఎ.ఆర్‌ టాప్‌లైన్‌ గృహ సముదాయంలో నివాసం ఉంటున్న సాబ్‌జాన్‌్‌(40), పర్విన్‌కు 17 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిత్తూరు ఎ.ఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే సాబ్‌జాన్‌ ఎప్పటిలాగానే విధులు ముగించుకుని శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లాడు. భార్యా భర్తల మధ్య చిన్న గొడవ తలెత్తింది. మాటా మాటా పెరగడంతో భార్య పర్విన్‌ ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్‌ పోసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఆయన కూడా కిరోసిన్‌ పోసుకున్నారని చెప్పారు. మంట ఎవ్వరు పెట్టుకున్నారోగానీ.. ఇద్దరికీ మంటలు అంటుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. మంటకు తట్టుకోలేక కేకలు పెట్టడంతో.. స్థానికులు మంటలు అదుపు చేసి, చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా వేలూరు సీఎంసీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. సీఎంసీ వైద్యులు పరిశీలించి, మెరుగైన వైద్య సేవలకు తీసుకెళ్లాలని సూచించడంతో.. కుటుంబ సభ్యులు వారిని వేలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాబ్‌జాన్‌ శనివారం సాయంత్రం మృతి చెందాడు. భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న చిత్తూరు ఒకటో పట్టణ సీఐ నిరంజన్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.